కర్నూలు: ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు జిల్లా సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున (సుమారు 3:30 గంటలకు) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. హైదరాబాద్ నుండి బెంగళూరుకు వెళ్తున్న ఒక ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన ఏసీ స్లీపర్ బస్సు, చిన్నటేకూరు వద్ద ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది.
ఈ ప్రమాదంలో బైకు బస్సు కిందకు దూసుకెళ్లడంతో ఒక్కసారిగా మంటలు చెలరేగి బస్సు మొత్తం వ్యాపించాయి. సమాచారం ప్రకారం, బస్సులో దాదాపు 40 మంది ప్రయాణికులు ఉన్నారు.
గాఢ నిద్రలో ఉన్న ప్రయాణికులు మంటల నుంచి తప్పించుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. కొందరు అద్దాలు పగలగొట్టి బయటపడగా, 25 మందికి పైగా సజీవ దహనం అయినట్లు అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు.
ప్రమాద సమాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. గాయపడినవారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుల సంఖ్యపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.